గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని, గోసంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు.
టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ టి. సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ గోశాలకు ఆదివారం 180 లారీల ద్వారా సుమారు 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతం నుండి ఎండుగడ్డిని సేకరించి, స్వంత నిధులతో పాటు రవాణా ఖర్చులను భరిస్తూ ఇంత భారీ స్థాయిలో మొదటిసారిగా విరాళం అందించడం అభినందనీయమన్నారు. గోవుల పరిరక్షణ, పాడి ఉత్పత్తుల పెంపు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఆదర్శమన్నారు. పురాణాలలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, గోసేవ సనాతన ధర్మమని పేర్కొన్నారు.
తిరుపతి ఎస్వీ గోశాలకు అందిన ఎండుగడ్డిని టిటిడి పరిధిలోని తిరుపతి, తిరుమల, పలమనేరు, బాకారాపేట సమీపంలోని కమలయ్యగారిపల్లి గోశాలలకు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ గోశాలల్లో మొత్తం 2974 గోవులు, ఎద్దులు, లేగదూడలు ఉన్నాయని వెల్లడించారు.
టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, గత ఏడాది 38 లారీల ఎండుగడ్డిని అందించగా, ఈసారి 180 లారీల ఎండుగడ్డిని విరాళంగా సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. జగ్గంపేట రైతులు ఉచితంగా ఎండుగడ్డిని అందించడం గొప్ప విషయమని రైతులను ప్రత్యేకంగా అభినందించారు. నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రవాణా తదితర ఖర్చులను భరిస్తూ ఎస్వీ గోశాలకు ఈ సేవ అందించామని తెలిపారు. ఈ సందర్భంగా టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ ఎస్వీ గోశాలకు రెండు గోవులు, దూడను విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి జానకీదేవి, శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీ శాంతారామ్, శ్రీ దర్శన్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవిఎన్ శివకుమార్, ఏవీఎస్వో శ్రీ రమేష్, వైద్యులు డా. భువన, డా. అనిల్, మేనేజర్లు మృదుల, గౌరీ, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments