తిరుపతి
శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి అశ్వవాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారు కల్కి అవతార అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్త బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నాదాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి వాహనసేవ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని పరవశించిపోయారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తాయి. అశ్వవాహనంపై కల్కి స్వరూపంలో దర్శనమిచ్చిన స్వామివారు, కలియుగ దోషాలకు దూరంగా ఉండి భగవన్నామ సంకీర్తన, ధర్మాచరణలను ఆశ్రయించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని సందేశమిచ్చారు.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈఓ శ్రీ ఏ.బీ.నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు, అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
No comments :
Write comments