29.5.26

టీటీడీలో రికార్డులు తిరగరాసిన "నల్ల బంగారం" black gold







కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంది. "నల్ల బంగారాన్ని" గత సంవత్సరాల కంటే ఏడాది మే నెలలో అత్యధికంగా మర్పించడం విశేషం. నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టి, నిరంతరాయంగా సేవలు అందిస్తోంది.


ఈ ఏడాది మే నెల‌లో 27వ తేది వ‌ర‌కు 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం. కాగా 2024 మే నెలలో మొత్తం 10,65,729 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 


ఇటీవల వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రాక భారీగా పెరిగింది. మే 18 నుండి 23 వరకు వరుసగా ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 50 వేలకుపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23వ తేదీన ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది.


వివిధ ప్రాంతాల్లో కళ్యాణకట్టలు


భక్తులకు వేచిచూసే సమయం తగ్గించేందుకు, సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5, జీఎన్‌సీ, హెచ్‌వీసీ, సప్తగిరి విశ్రాంతి గృహం, నందకం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీవేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతాల్లో మొత్తం 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.


విశేష స్థాయిలో సేవలు అందిస్తున్న క్షురకులు 


టీటీడీలో మొత్తం 1,152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళా క్షురకులు కూడా ఉన్నారు. భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒక్కో క్షుర‌కుడు త‌మ విధుల్లో భాగంగా 6 గంట‌ల షిఫ్టులో 40 మందికి క్షర కర్మ చేస్తారు. మ‌రోవైపు పెరిగిన ర‌ద్దీకి అనుగుణంగా 250 మంది సిబ్బందికి ప్ర‌తిరోజూ అద‌నంగా విధులు కేటాయించ‌డంతో ఒక్కో క్షరకుడు అదనంగా దాదాపు 50 మంది భక్తులకు క్షర కర్మ చేస్తూ నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తున్నారు.


క‌ళ్యాణ‌క‌ట్ట‌లో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట‌


భ‌క్తులు అత్యంత ప‌విత్రంగా భావించే క‌ళ్యాణ‌క‌ట్ట‌ల్లో టీటీడీ ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేసింది. భ‌క్తుల‌కు కేటాయించే బ్లేడ్ల‌ను క్షుర‌కులు ముందుగా సోడియం సొల్యూషన్ లో ముంచి ఆ త‌ర్వాత‌ డెటాయిల్ తో శుభ్ర‌ప‌ర‌చ‌డం జ‌రుగుతోంది. అదేవిధంగా త‌ల‌నీలాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించి భ‌ద్ర‌ప‌ర‌చ‌డం జ‌రుగుతోంది. ప్రతి క‌ళ్యాణ‌క‌ట్ట‌లో భ‌క్తులకు స్నాన‌పు గ‌దుల‌తో పాటు వేడి నీరు అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ అనంత‌రం భ‌క్తుల‌కు చంద‌నం బిళ్ల‌ల‌ను కూడా టీటీడీ అందిస్తోంది


భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తలనీలాల సమర్పణ కేంద్రాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, కూర్చునే సదుపాయాలు, టోకెన్ విధానం తదితర ఏర్పాట్లను టీటీడీ మరింత బలోపేతం చేసింది.

No comments :
Write comments