25.5.26

తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణకు టీటీడీ ప్రత్యేక చర్యలు CLEANLINESS








వేసవి సెలవులు, వారాంతాలు, ప్రత్యేక దర్శనాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణకు అత్యం ప్రాధాన్య‌త‌నిస్తోంది.


తిరుమలలో ప్రస్తుతం సుమారు 210 మ‌రుగుదొడ్లు భక్తులకు అందుబాటులో ఉండటంతో పాటు మరో  130 సంస్థాగత మరుగుదొడ్లను టీటీడీ నిర్వహిస్తోంది. ప్రతి మ‌రుగుదొడ్ల వ‌ద్ద‌ ప్రత్యేక సిబ్బందిని నియమించి, గంట గంటకూ శుభ్రపరిచే విధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ అమలు చేస్తోంది.  ర‌సాయనాలు, డిసిన్ఫెక్ట్ వినియోగం, ప‌రిశుభ్ర‌త‌ ప్రమాణాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా అందించ‌డం జ‌రిగింది.


భక్తుల వినియోగం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని మ‌రుగుదొడ్ల‌ను రోజుకు 1,500 నుంచి 2,000 మందికి పైగా భ‌క్తులు వినియోగిస్తున్నారు. ఇక రోడ్ల పరిశుభ్రత విషయంలో కూడా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రియ‌ల్ టైమ్ రోడ్ స్వీపింగ్‌, చెత్త సేకరణ, నీటి స్ప్రే వంటి పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇటీవల ఆకులు రాలే కాలంలోనూ పారిశుద్ధ్య సిబ్బంది నిరంత‌రం శ్ర‌మించి తిరుమల పరిశుభ్రతకు విశేష కృషి చేశారు.


ఇటీవల భక్తుల రద్దీ భారీగా పెరగడంతో బ‌య‌ట క్యూ లైన్ల‌లో  భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ నిరంతరం కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది భక్తులు ఆహార పదార్థాలను పూర్తిగా వినియోగించకుండా పారవేయడం వల్ల ఆహార వ్యర్థాలు అధికంగా పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో క్యూ లైన్ల వెను భాగాల్లో ఆహార వ్యర్థాలు ఎక్కువగా చేరుతున్నాయి.


కొండ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, గోతులు, స్లోప్ ప్రాంతాలు, డ్రైనేజీ మార్గాలు, రాత్రివేళల్లో పాముల సంచారం వంటి క్లిష్ట రిస్థితుల్లోనూ అంకితభావంతో పారిశుద్ధ్య సిబ్బంది మరుసటి ఉదయం నుంచే ప్రత్యేక శుభ్రత చర్యలు చేపడుతున్నారు. సేకరించిన వ్యర్థాలను తొలగించడంతో పాటు బ్లీచింగ్ చ‌ల్ల‌డం వంటి చర్యలు కూడా చేపడుతున్నారు


సాధారణ రోజుల్లో 50 టన్నుల వరకు ఉండే తడి వ్యర్థాలు ప్రస్తుతం భక్తుల రద్దీ పెరగడంతో 60 నుంచి 75 టన్నుల వరకు పోగ‌వుతోంది. దనంగా డ్రై వేస్ట్ కూడా గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ అందుబాటులో ఉన్న సిబ్బందితోనే టీటీడీ పారిశుద్ధ్య విభాగం సమర్థవంతంగా పారిశుద్ధ్యం నిర్వ‌హ‌ణ‌ను కొనసాగిస్తోంది.


తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ప‌రిస‌రాల పరిశుభ్రతలో భాగస్వామి కావాలని, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్ సిబ్బంది కృషిని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాలను వృథా చేయకుండా సహకరించాలని భ‌క్తుల‌కు టీటీడీ విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది.

No comments :
Write comments