
తిరుపతిలోని
శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై దివ్యమంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిచ్చి అభయప్రదానం చేశారు.
భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని పరవశించారు.
త్రేతాయుగంలో శ్రీరాముడికి పరమభక్తుడిగా వెలుగొందిన హనుమంతుడు భక్తి, శక్తి, శరణాగతికి ప్రతీకగా నిలిచాడు. బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం, నిర్భయత్వం, వాక్పటిమ హనుమత్స్మరణతో సిద్ధిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే స్వామివారు హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులకు శరణాగతి మహిమను చాటిచెప్పారు.
అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేశారు.
మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం ఘనంగా జరగనుంది. అనంతరం స్వామివారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు.
రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎవ్వో శ్రీ శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments