తిరుపతిలోని
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి వైభవంగా సాగిన వాహనసేవలో గజరాజులు ముందుండగా, మంగళవాయిద్యాలు, కోలాటాలు, గోవింద నామస్మరణల నడుమ మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడాయి. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు.
ప్రకృతికి ప్రాణాధారమైన వృక్షాలలో కల్పవృక్షం అత్యున్నతమైనదిగా పురాణాలు వర్ణిస్తాయి. సముద్ర మథనంలో ఆవిర్భవించిన ఈ దేవతా వృక్షం భక్తుల వాంఛిత ఫలాలను ప్రసాదించేదిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన కోనేటిరాయుడు భక్తుల కోరికలను తీర్చే దేవదేవుడిగా దర్శనమిచ్చి భక్తజనులను పరవశింపజేశారు.
స్నపన తిరుమంజనంలో భక్తి పరవశం
ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం చేసి వేదమంత్రోచ్చారణల నడుమ విశేష పూజలు నిర్వహించారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు.
సర్వభూపాల వాహనంపై రాత్రి దివ్య దర్శనం
ధర్మపాలనకు దివ్య సందేశమిచ్చే గోవిందుడు
రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. “రాజా ప్రజారంజనాత్” అన్న సూక్తికి అనుగుణంగా ప్రజలను రక్షించి ధర్మాన్ని స్థాపించేవారే నిజమైన పాలకులని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు సందేశమిస్తారు. కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వలోకాల అధిపతిగా సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారని ఆగమశాస్త్రాలు పేర్కొంటాయి.
మే 27న వైభవంగా గరుడసేవ
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగే గరుడసేవ బుధవారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడవాహనంపై స్వామివారి దివ్య దర్శనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో శ్రీ ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయరావు, శ్రీ రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments