శ్రీ
తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం శ్రీవారి దివ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది.
ఉదయం 10 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను కల్యాణవేదికకు తీసుకువచ్చారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యాహవచనం, పవిత్ర హోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళాశాసనం వంటి ఘట్టాలతో కల్యాణం వైభవంగా జరిగింది. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతులతో కార్యక్రమం ముగిసింది.
టీటీడీ భక్తులకు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందించగా, అనంతరం పెద్దసంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.
అంతకుముందు ఉదయం 9 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చెన్నైకు చెందిన డా. తాళ్లపాక మీనలోచని సంగీత సభ, రాత్రి 7.30 గంటలకు కర్నూలుకు చెందిన శ్రీమతి లక్ష్మీ మహేష్ బృందం హరికథ గానం నిర్వహించనున్నారు.
అన్నమయ్య విగ్రహం వద్ద ఊంజల్ సేవ వైభవం
రాజంపేట–కడప రహదారిపై ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద శనివారం సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు శ్రీవారి ఊంజల్ సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలను ఆలపించనున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ రమణయ్య బృందం హరికథ కార్యక్రమం నిర్వహించనుంది.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments