తిరుపతిలోని
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అభయానుగ్రహాలు ప్రసాదించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, వేదఘోషల నడుమ తిరుపతి మాడవీధులు భక్తిరసంతో పరవశించాయి.
నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజూ భిన్న అలంకారాలలో భక్తులను అలరిస్తుంటాడు. ముత్యపుపందిరిపై వెలసిన స్వామివారి దివ్య మంగళవిగ్రహం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ప్రతీకగా భావించే ముత్యం చల్లదనానికి, శాంతికి సంకేతం. సముద్రగర్భం ప్రసాదించిన అమూల్య రత్నాలైన ముత్యాల కాంతుల మధ్య నిలిచిన శ్రీహరి దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి, జీవితాల్లో ప్రశాంతతను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనే విశ్వాసం భక్తుల్లో వెల్లివిరిసింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో శ్రీ ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయరావు, శ్రీ రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments