టీటీడీ
స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి ఆభరణాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమల శ్రీవారి ఆలయం నుండి రూ.33 లక్షల విలువైన స్వర్ణాభరణాలను బహుకరించారు.
ఈ ఆభరణాలలో శీమ కమలాలు, నవరత్న పూసలతో కూడిన రెండు పేటల బంగారు హారం, బంగారు లక్ష్మీకాసుల మాల ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం తరఫున ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఈ ఆభరణాలను నారాయణవనం ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందజేశారు.
అనంతరం మంగళవాద్యాల నడుమ ఆభరణాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి, మూలమూర్తి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, తిరుమల బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments