కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దివ్యంగా విహరించి భక్తులకు అభయానుగ్రహాలు ప్రసాదించారు. గ్రామ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగగా, భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.
జగత్తుకు చైతన్యప్రదాత సూర్యనారాయణుని మహిమ
సూర్యుడు తేజోనిధి, సకల జీవరాశులకు ప్రాణాధారం. వర్షాలు, పంటలు, ఔషధాలు, ప్రకృతిలోని సమస్త చైతన్యానికి మూలకారణమైన సూర్యతేజస్సుకు ప్రతీకగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వడం విశేష ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది.
రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారి అనుగ్రహం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూన్ 13న రథోత్సవం
వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం ఉదయం 7.30 గంటలకు శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రథంపై గ్రామ వీధుల్లో విహరించి స్వామివారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
అదే రోజు రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments