19.6.26

ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సమావేశం meeting with millers







తిరుమలలో అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసులను వినియోగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో టీటీడీకి అవసరమైన పప్పు దినుసుల నాణ్యత, పరిమాణం, సరఫరా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రోజువారీ అన్నప్రసాదాల తయారీలో శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగలు వంటి ఏడు రకాల పప్పు దినుసులను టీటీడీ వినియోగిస్తోందని అదనపు ఈవో తెలిపారు.

గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల నుంచి కూడా నాణ్యతతో పాటు అవసరమైన పరిమాణంలో పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు.

దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల ప్రతినిధులు, ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు మహా యజ్ఞంగా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ సేవలో భాగస్వాములై, నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అనంతరం పప్పు మిల్లర్ల నుంచి పప్పు దినుసుల కొనుగోలుకు ఉన్న పారదర్శకమైన విధానాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.

ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వేర్‌ హౌసింగ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి, జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) శ్రీ ఉమాశంకర్, పోటు ఏఈవో శ్రీ మునిరత్నం, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు పప్పు మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments :
Write comments