తిరుపతిలోని
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లగా, భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు సమర్పించారు.
అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో తెలిసీ తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆలయ సంప్రదాయం.
ఈ సందర్భంగా తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం, దమనము, బిల్వం, పన్నీరాకు తదితర 6 రకాల పవిత్ర పత్రాలతో కలిపి మొత్తం మూడు టన్నుల పుష్పాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు ఈ పుష్పాలను విరాళంగా అందించారు.
సాయంత్రం స్వామివారు, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దివ్యమంగళ దర్శనం ప్రసాదించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎస్. శ్రీనివాసులు, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ రంజిత్, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments