నారాయణవనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన ఆదివారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు.అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సర్వలోకాల పాలకుడిగా, రాజాధిరాజుగా సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు.
వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.
సర్వభూపాల వాహన విశిష్టత
“సర్వభూపాలులు” అంటే సమస్త రాజులు అని అర్థం. ప్రజలను ధర్మమార్గంలో నడిపించి వారి సంక్షేమాన్ని కాంక్షించే రాజులందరికీ అధిపతి భగవంతుడే అనే సనాతన సందేశాన్ని ఈ వాహనసేవ చాటిచెబుతుంది. జగన్నాయకుడైన శ్రీహరి సమస్త భూపాలులను పరిపాలించే రాజాధిరాజుగా ఈ వాహనంపై దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్ రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments