ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ప్రయోగాత్మక దశలో కార్యక్రమాన్ని అమలు చేసి, పాల్గొనే వైద్య నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు విద్య, వైద్యం, ఐటీ తదితర రంగాల్లో సేవా భావంతో ముందుకు వచ్చే నిపుణులకు టీటీడీ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
టీటీడీ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు వచ్చే నిపుణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేసి ఎక్కువ మంది నిపుణుల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపడతామని వివరించారు.
ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని సేవలందించవచ్చు.
సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజుల పాటు, ఎంబీబీఎస్ వైద్యులకు ఏడు రోజుల పాటు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం కల్పించనున్నారు. వీరికి తిరుమల, తిరుపతిలో వసతి, భోజన సౌకర్యాలు టీటీడీ ద్వారా అందించబడతాయి.
అశ్విని ఆసుపత్రి, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వీ గోశాల తదితర టీటీడీ అనుబంధ సంస్థల్లో వైద్య నిపుణులు తమ సేవలను అందించనున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటాచలం, సికింద్రాబాద్ లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ఏ శాస్త్రి, వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, బెంగళూరు ఈఎస్ఐ హాస్పిటల్ ఆర్తో హెచ్ఓడి డాక్టర్ పురుషోత్తం ఈవోతో వర్చువల్‌గా మాట్లాడి, టీటీడీ ఆసుపత్రుల్లో సేవలందించే అవకాశం కల్పించడం శ్రీవారి అనుగ్రహంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈఓలు (విద్య, వైద్యం) డాక్టర్ శరత్, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments