4.6.26

సూర్యప్రభపై సారంగపాణిగా భక్తులను కటాక్షించిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు surya prabha vahanam







నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు బుధవారం ఉదయం స్వామివారు సారంగపాణి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.

సూర్యకిరణాల తేజస్సును తలపించే ఈ వాహనసేవలో స్వామివారి అపూర్వ రాజసం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.

కర్పూరహారతులతో మార్మోగిన నారాయణవనం

స్వామివారి విహార మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళ వాయిద్యాలు ఉత్సవాలకు ప్రత్యేక శోభను చేకూర్చాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

సూర్యనారాయణుని మహిమను చాటిన సూర్యప్రభ వాహనం

సకల జీవరాశులకు చైతన్యాన్ని ప్రసాదించే సూర్యుడు ఆరోగ్యప్రదాత, జీవనాధారం. సూర్యమండల మధ్యలో విరాజిల్లే శ్రీమన్నారాయణుడే సూర్యనారాయణుడని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ మహాతేజోమయమైన సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సత్సంతాన ప్రాప్తి కలుగుతాయని పురాణాలు విశదీకరిస్తున్నాయి.

రాత్రికి చంద్రప్రభ వాహనసేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.

జూన్ 04 రథోత్సవంశ్రీవారి ల్యాణోత్సవం

వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవోపేత ఘట్టమైన రథోత్సవం జూన్ 04న ఉదయం 7.45 గంటలకు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, రాత్రి 8.30 గంటలకు శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments :
Write comments