3.5.25

భక్తి ఉద్యమంతో సంఘాన్ని సంస్కరించిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు: శ్రీ కె.ఈ.ల‌క్ష్మీన‌ర‌సింహ‌న్




భక్తి ఉద్యమంతో సమానత్వాన్ని బోధించి సమాజాన్ని సంస్కరించిన మహనీయుడు భగవద్‌ రామానుజాచార్యులని తిరుపతికి చెందిన

శ్రీ కె.ఈ.ల‌క్ష్మీన‌ర‌సింహ‌న్ పేర్కొన్నారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న రామానుజాచార్యుల అవ‌తార మ‌హోత్స‌వాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి.
ఈ సంద‌ర్భంగా శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌న్ ''రామానుజాచార్యులు - తిరుమ‌ల కైంక‌ర్యాలు '' అనే అంశంపై ప్రసంగిస్తూ, భగవద్‌ రామానుజార్యులు సాక్షాత్తు ఆదిశేషుని అంశ అని తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, దివ్యదేశాలలో ఆయన స్థాపించిన వ్యవస్థ నేటికి కొనసాగుతుందన్నారు.
సాక్షత్తు ఆదిశేషుడే త్రేతా యుగంలో లక్ష్మణుడిగా, కలియుగంలో రామానుజాచార్యులుగా జన్మించి శ్రీవారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న ప్రధమ సేవకుడని తెలిపారు. తిరుమ‌ల ఆల‌య నాలుగు మాడ వీధులు నిర్మించి, స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రిగే విధంగా ఏర్పాట్లు చేశార‌న్నారు. స్వామివారికి శుక్ర‌వారం అభిషేకం ప్ర‌వేశ‌పెట్టి, శంఖుచ‌క్రాల‌ను ఏర్పాటు చేశార‌ని చెప్పారు. తిరుమ‌ల‌లో జీయ‌ర్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి, తానే మొద‌టి జీయ‌ర్‌గా ఉండి శ్రీ‌వారి కైంకర్యాలు చేశార‌ని తెలిపారు. అదేవిధంగా తిరుప‌తిలో శ్రీ గోవింద‌రాజ స్వామివారిని ప్ర‌తిష్టించి, అనేక కైంక‌ర్యాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలియ‌జేశారు.
తిరుమలలో ఆళ్వార్ల‌ పాశురాలు ప్ర‌తి సేవ‌లో ఉండే విధంగా ఒక నియ‌మాన్ని ఏర్పాటు చేశారన్నారు. రామానుజాచార్యుల మేనమామ శ్రీ తిరుమల నంబి తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాలు చేశారని, శ్రీ ఆనంతాళ్వారు పుష్ప కైంకర్యాలు నిర్వహించారని వివరించారు. తిరుమల, తిరుపతిపై రామానుజుల ప్రభావం మెండుగా ఉందన్నారు. తిరుమల శ్రీవారికి శ్రీరామానుజాచార్యులు నిర్దేశించిన సేవలను చక్కగా నిర్వహించాలని, ఈ సేవల్లో పాల్గొంటే ఎంతో పుణ్యఫలమని వివ‌రించారు.
అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ‌మ‌తి లక్ష్మీ రాజ్యం బృందం గాత్ర సంగీతం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments