శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న పద్మావతి పరిణయ మండపంలో ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.
ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి చేరుకున్నారు. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు గోష్టిగానం నిర్వహించారు. ఇందులో వెంగమాంబ రచించిన వివిధ సంకీర్తనలను కళాకారులు ఆలపించారు.
ఈ సందర్భంగా బెంగుళూరు రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. నరసింహస్వామి అనుగ్రహంతో వెంగమాంబ ఉదయించిందని తెలిపారు. ఎలాంటి గురువులు, ఉపదేశాలు లేకుండా స్వయం ప్రవృత్తితో ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను నేర్చిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ మానవ జాతిలో జన్మించిన దేవత అని కీర్తించారు. శ్రీవారి ఏకాంత సేవలో వెంగమాంబ చూపిన మార్గంలోనే ముత్యాలు హారతి జరుగుతోందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఆదివారం సాయంత్రం టీటీడీ అధికారులు, వెంగమాంబ వంశీకులు పుష్పాంజలి ఘటించారు.




No comments :
Write comments