సనాతన ధర్మం సంస్కృతిని పామరులకు తెలియజేసేందుకు తాళ్లపాక అన్నమాచార్యుల వారిని భగవంతుడు తన అంశగా పుట్టించారని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ కంట్యాక్స్ శ్రీ కె.ఎస్.ఎ. శేష శైలేంద్ర తెలిపారు. శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శుక్రవారం అన్నమాచార్య కళామందిరంలో ఆయన అన్నమాచార్య సంకీర్తనలు - నవవిధ భక్తిమార్గాలు అనే అంశంపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ జీవితంలో ఎన్ని విధాలైన పార్శాలు, కార్యకర్మలు, అనుభూతులు ఎదురౌతాయే వాటినన్నింటిని కీర్తనలు ద్వారా ఈ సమాజానికి అన్నమాచార్యులు అందించారన్నారు. నవరసాలనే కాకుండా నవ భక్తి మార్గాలను చూపారన్నారు. శ్రవణం, కీర్తనం, అర్చన, స్మరణ, వందనం, పాద సేమనం, ఆత్మ నివేదన, సఖ్యం, ధాస్యం ద్వారా భక్తిని, ధర్మాన్ని ఏ విధంగా అనుసరించాలో పాటించి చూపారని ఆయన తెలిపారు.
అంతకుముందు ప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్, అన్నమయ్య కీర్తనలు - భగవద్గీత సందేశం అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత సర్వ ధర్మ సారానికి ప్రతీకయని అభివర్ణించారు. "ఇదం గీతా శాస్త్రం సమస్త వేదార్థసార సంగ్రహ భూతమని " ఆదిశంకరుల వారు వ్యాఖ్యానించడమేకాక సమగ్ర భాష్యంతో పాటు గూఢార్థమును ప్రపంచానికి అన్నమయ్య అందించారన్నారు. అన్నమయ్య తన కీర్తనలలో భగవద్గీత సారాన్ని కూడా ఆలపించారని, అన్నమయ్య ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు కూడా అని ఆయన తెలిపారు.
ఈ సందర్బంగా తిరుపతికి చెందిన శ్రీ పొన్నా కృష్ణమూర్తి అన్నమయ్య సంకీర్తనలలో సామాజిక చైతన్యం - ముక్తి మార్గం అనే అంశంపై మాట్లాడుతూ, లోకంలో జరిగే అతి సామాన్యమైన పొరపాట్లను క్షమించమని భగవంతుని ప్రార్థించే విధానం, చిల్లర వేశాలు వేయనివారెవరు, శరణాగతి అని స్వామి వారి అనుగ్రహణ పొందడం అన్నమయ్య కీర్తనలలో కనిపిస్తుందన్నారు.
అంతకుముందు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు అంధుల కోసం బ్రైయిలీ లిపిలో 956 కీర్తనలతో రూపొందించిన పుస్తకాన్ని శ్రీ కె. ఎస్.ఎ. శేష శైలేంద్ర ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ లో తంబుర ఆర్టిస్ట్ డా. బాగేపల్లి ఈశ్వరి రూపొందించారు.
సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విశ్రాంత గాయకులు శ్రీ బి. రఘునాథ్ బృందం సంగీత సభ, తిరుపతికి చెందిన శ్రీమతి వి. ప్రమీల బృందంచే హరికథ జరుగనుంది.











No comments :
Write comments