18.5.25

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం






శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహ‌స్ర‌నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.

మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వసంతోత్సవాలు 19వ తేదీ వరకు జరుగనున్నాయి.
మే18న స్వర్ణరథోత్సవం
మే 18వ‌ తేదీ ఆదివారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో నిత్యకల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ ముని రాజా, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని కుమార్, ఆలయ అర్చకులు , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments