12.5.25

టీటీడీ స్థానికాలయాల్లో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు





దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీకి చెందిన పలు స్థానిక ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో...
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు.
అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం తో అభిషేకం చేశారు.
రాత్రి 7 గంటల నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో...
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా విష్వ‌క్సేన పూజ, కలశ‌ ప్ర‌తిష్ట‌, వాసుదేవ పుణ్యాహ‌వాచనం, నవక‌లశ‌ ఆరాధన, ధ్వ‌జ‌స్థంభానికి అభిషేకం నిర్వ‌హించారు.
ప్ర‌తి రోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు ఆల‌యంలో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.
న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో...
న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 నుండి 8.07 గంటల మ‌ధ్య వృషభ ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.
రిషికేష్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో...
ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా, రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఉద‌యం 10.50 నుండి 11.15 గంట‌ల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
ఈ కార్యక్రమాల్లో టీటీడీ అధికారులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

No comments :
Write comments