5.6.25

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి










తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం అనంతతేజోమూర్తి గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 9.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


మృగాల్లో రారాజు సింహం. గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనంతతేజోమూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనసులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది. అందుకే ధీరోదాత్తుడైన శ్రీ వేంకటేశ్వరుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు.

అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 - 06.00 గంటల వరకు ఊంజల్ సేవ  వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు ఒక్కొక్కరోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ప్రత్యేకంగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

No comments :
Write comments