తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది.
ముత్యపు పందిరి – సకల సౌభాగ్య సిద్ధి
నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు పూటకొక అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.










No comments :
Write comments