5.7.25

తెల్లదొరల పాలిట సింహ స్వప్నం అల్లూరి - ప్రొ. జి. బాలసుబ్రమణ్యం Alluri Sita Rama Raju





మన్యంలో తెల్లదొరల పాలిట సింహస్వప్నం శ్రీ అల్లూరి సీతారామ రాజు అని అనంతపురం ఎస్.కె.యూనివర్శిటీ తెలుగు విభాగం ఆచార్యులు ప్రొ. జి. బాలసుబ్రమణ్యం తెలిపారు.  టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శ్రీ అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన్యం ప్రాంతాలలో తెల్ల దొరల దోపిడిపై అల్లూరి సీతారామ రాజు పోరాటం చేసి యోధుడు అయ్యారని మాట్లాడారు. బడుగు ప్రజల కోసం అల్లూరి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని,  అల్లూరి కుటుంబ సభ్యులు సైతం నేటికి సామాన్య జీవితాన్ని గడపుతున్నారని ఆయన గుర్తు చేశారు. అల్లూరి సీతారామ రాజు త్యాగాలను చెప్పుకుని లబ్ది పొందాలనే ఆలోచన అల్లూరి కుటుంబ సభ్యులకు లేదని, కష్టాన్ని నమ్ముకుని బ్రతకాలని, నిరాడంబరంగా జీవితాన్ని గడపడం వారి గొప్పతనానికి నిదర్శనం అన్నారు. అల్లూరి సీతారామరాజులోని ధాదృత్వం, క్షమాగుణం, దేశభక్తి, ఆధ్యాత్మికత, పోరాడేతత్వంను నవతరం ఆకలింపుచేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి జి. సువర్ణ మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కులకు రక్షణగా ఉంటూ చివరి నిమిషం వరకు పోరాడారని చెప్పారు. అల్లూరి సీతారామ రాజు ఆ రోజుల్లో తప్పని పరిస్థితుల్లో తిరుగుబాటు ధోరణితో హక్కుల కోసం పోరాటం చేశారని, నేటి యువత ఆయనలోని ధైర్యాన్ని మననం చేసుకుని జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాలని సూచించారు.
 ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు ధీరత్వంపై పలువురు వక్తలు ప్రసంగించారు.
అంతకుముందు టిటిడి వెల్పేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి అంజలి ఘటించారు. అన్నమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు హారతులు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో (వెల్ఫేర్) శ్రీ ఏ. ఆనందరాజు, పలువురు టిటిడి ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments