31.7.25

వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభం - వైభ‌వంగా శ్రీ సీతారాముల‌ కళ్యాణం valmikipuram




వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.


ఇందులో భాగంగా ఉద‌యం 10 గంట‌ల‌కు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నంల‌తో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం వైభ‌వంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై  విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

జూలై 31న ఉదయం యాగశాల పూజ, ఉద‌యం 6.30 గంట‌ల‌కు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఆల‌య అధికారులు, అర్చ‌కులు పాల్గొన్నారు.

No comments :
Write comments