26.8.25

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ pavitra samarpana

 





ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా  సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం బాల‌బోగం, చ‌తుష్టానార్చ‌న‌,  ప‌విత్ర హోమం, మ‌ధ్యాహ్న ఆరాధ‌న‌, బ‌లిహ‌ర‌ణ‌, శాత్తుమొర చేప‌ట్టారు.


అనంత‌రం ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ సీతా స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు ఘ‌నంగా స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నంల‌తో స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.  

ఈ సంద‌ర్భంగా యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం ప‌విత్ర‌హోమం, నివేద‌న‌, శాత్తుమొర జ‌రుగ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ప్ర‌శాంతి, సూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ న‌వీన్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments