తిరుమల పవిత్రతను కాపాడుతూ, సప్తగిరులను ఆనుకుని ఉన్న భూములను అన్యాక్రాంతం కానివ్వమని, ఆ భూమిని భక్తుల సౌకర్యాల కోసం వినియోగించనున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో మంగళవారం సాయంత్రం టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
టిటిడి మీద చేస్తున్న విష ప్రచారపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ బంధువులకు మీడియా ద్వారా వాస్తవాలు తెలియజేస్తున్నా...
2008లో పిపిపి ద్వారా 30.32 ఎకరాల టూరిజం ల్యాండ్ ను దేవలోక్ కు ఇవ్వాలని ఎంవోయూ చేసుకున్నారు. 2011న ఇంటర్నేషనల్ బెడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఎల్.ఓ.ఐ ద్వారా దేవలోక్ కేటాయింపు, 2014న ఆ భూమిని దేవలోక్ కు టూరిజం శాఖ కేటాయింపు, 2021 ఏడాదిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ ఇవ్వగా, గత ప్రభుత్వం 20 ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్ కు, మరో 5 ఎకరాలు మేడా ప్రాజెక్ట్ కు కేటాయించారని తెలిపారు. ముంతాజ్ హోటల్ కు భూములు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపట్టారని గుర్తు చేశారు.
18.11. 2024 లో టిటిడి బోర్డు రెండో అంశం క్రింద సదరు అంశాన్ని చర్చించి ముంతాజ్ హోటల్ కు ఇవ్వడం సబబు కాదని తీర్మానం చేసి గవర్నమెంట్ కు పంపామన్నారు. మార్చి 21న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వచ్చిన సందర్భంలో ఈ అంశంపై చర్చించి సదరు 25 ఎకరాలతో పాటు మిగిలిన భూములను కలిపి మొత్తం 50 ఎకరాల భూమిని టిటిడి తీసుకోవాలని నిర్ణయించిందన్నారు. ముంతాజ్ హోటల్ వారితో స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపులు చేసి మరోచోట రోడ్డుకు అటు వైపు స్థలం కేటాయించేందుకు అంగీకరించేలా ఒప్పించారని తెలిపారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇప్పటికే రూ. 30 కోట్లు ఖర్చు చేశామని మొండికేయడంతో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని స్థలం మార్పిడికి అంగీకరించేలా చేసారన్నారు. దీనికి సంబంధించి స్థలం మార్పిడి అంశం ప్రాసెస్ లో ఉండగానే కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా రోజుకో విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
టూరిజం ల్యాండ్ ను ముంతాజ్ హోటల్ కు కేటాయించింది మీ పాలనలో కాదా అని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు ప్రశ్నించారు. టిటిడి భూములను ప్రైవేట్ వాళ్లకు ఇచ్చింది మీరే కదా, టిటిడి భూములను మీ పాలనలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకపోతే ఈ రోజు ఈ సమస్యే ఉండేది కాదు కదా, తప్పులన్నీ మీరు చేసి సిబిఐ విచారణ కోరడం హాస్యాస్పదం అని తెలిపారు..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులను ఒకటే కోరుతున్నా, నూతన పాలక మండలి వచ్చాక భక్తుల సౌకర్యాలు కల్పించాలనే ధ్యాస తప్ప మరో ఆలోచనే తమకు లేదని, అయినా టిటిడి మీద స్వప్రయోజనాల కోసం విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. నిజమైన శ్రీవారి భక్తులు ఎవరూ పదే పదే తిరుమల పవిత్రను పలుచన చేసి మాట్లాడరని హితవు పలికారు.
దేవలోక్ యాజమాని శ్రీ అజయ్ కుమార్ ను బెదిరించి సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నది వాస్తవం కాదా అన్నారు. శ్రీ అజయ్ కుమార్ సైతం అప్పటి బెదిరింపులపై ఫిర్యాదు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. శ్రీ అజయ్ కుమార్ అప్పట్లో ఫిర్యాదు చేసిన ప్రతులను మీడియాకు పంపిణీ చేశారు.
రోడ్డుకు ఎదురుగా ఉన్న భూమిని టూరిజం శాఖకు కేటాయించేందుకు తాజా టిటిడి బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపామన్నారు. దీనికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ లో ఉందన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా సదరు అంశంపై శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి రోజుకో విధంగా వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు.
టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, 2019 నుండి 2024 వరకూ హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలిందని, శ్రీవారి పరకామణిలో అవినీతి జరిగితే దొడ్డిదారిన లోక్ అదాలత్ లో కేసు పరిష్కరించుకోవడం చూస్తే వారి చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పరకామణిలో అవినీతి కేసును తిరిగి దర్యాప్తు చేయిస్తామన్నారు. రాజకీయ నిరుద్యోగిగా మారిన టిటిడి మాజీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిదని హితవు పలికారు.
బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముంతాజ్ హోటల్ అంశం తెర మీదకు తెచ్చిందే గత ప్రభుత్వం హయాంలో అని తెలిపారు. దేవలోక్ యజమాని శ్రీ అజయ్ కుమార్ తన వద్దకు వచ్చి వారి బాధ వెళ్లగక్కున్నారన్నారు.
బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి మాట్లాడుతూ, ప్రతిపక్షాలు టీటీడీ బోర్డుపై ఎటువంటి ఆరోపణలూ చేసే అవకాశం లేక వారి పాలనలో జరిగిన తప్పులను ప్రస్తుత బోర్డు చేసినట్లు బురద చల్లుతున్నారన్నారు. టిటిడి చైర్మన్, పాలక మండలి భక్తులకు విశేష సేవలు అందిస్తుందని చెప్పారు.







No comments :
Write comments