15.8.25

భక్తుల భద్రతే లక్ష్యంగా ప‌టిష్ట ఏర్పాట్లు : టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు TTD eo




తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 24 నుండి అక్టోబ‌రు 2వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా, వారి భద్రతే లక్ష్యంగా టిటిడి విజిలెన్స్‌, పోలీస్‌ సిబ్బందితో ప‌టిష్ట‌మైన భ‌ద్రతా ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఈవో కార్యాల‌యంలో గురువారం అధికారుల‌తో ఆయన స‌మీక్షించారు.


ఈ సంద‌ర్బంగా ఈవో మాట్లాడుతూ, గ‌త‌ బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి బ్రహ్మోత్సవాలలో టీటీడీ విజిలెన్స్‌ మ‌రియు పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాల‌న్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు తిలకించడానికి ఏర్పాట్లు చేయాల‌న్నారు. అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద అద‌నంగా మ‌రో 12 స్కాన‌ర్‌ల‌ను త్వ‌రిత గ‌తిన ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అధిక సంఖ్యలో రానున్న వాహనాల మూలంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో పార్కింగ్ ప్రాంతాల‌ను పోలీస్‌, విజిలెన్స్ అధికారులు  ముంద‌స్తుగా ప‌రిశీలించాల‌న్నారు. భ‌క్తుల‌కు సుల‌భంగా తెలిసేలా తిరుమ‌ల‌, తిరుప‌తి ముఖ్య కూడ‌ళ్లలో వివిధ‌ భాష‌ల‌లో సైన్‌బోర్డులు, సూచిక‌బోర్డులు ఏర్పాటు చేయ‌ల‌ని చెప్పారు. అదేవిధంగా తిరుప‌తి, తిరుమ‌ల‌లో పార్కింగ్ ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌న్నారు.

ఈ స‌మీవేశంలో అద‌న‌పు ఈవో శ్రీ వెంక‌య్య చౌద‌రి వ‌ర్చువ‌ల్‌గా, సివిఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ ఓ.బాలాజి, విజివో శ్రీ ఎన్. రాంకుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments