10.11.25

తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజనం karthika vanabhojanam









పవిత్ర కార్తీకమాసం సందర్భంగా ఆదివారం తిరుమలలో కార్తీకవనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో టిటిడి ఘనంగా నిర్వహించింది.

         
దీనిని పురస్కరించుకొని శ్రీమలయప్ప స్వామివారిని బంగారుతిరుచ్చిపై వేంచేపు చేసి వాహన మండపానికి తీసుకువచ్చారు. ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం మలయప్పస్వామి వారిని చిన్న గజవాహనంపై వాహనమండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అదే విధంగా అందంగా అలంకరించి మరో పల్లకిపై ఉభయనాంచారులను రంగనాయక మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. 

అనంతరం ఉద‌యం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ భూ స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్నపన తిరుమంజనం వైభ‌వంగా నిర్వహించారు.

చారిత్రక ప్రాశస్థ్యం:

కాగా ఈ వనభోజన మహోత్సవాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి పెద్దకుమారుడైన శ్రీ పెద తిరుమలాచార్యులవారు 16వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే ఏకారణాల వల్లనో ఈ కార్తీక వనభోజనోత్సవం ఆగిపోయింది.
 
సుమారు 500 ఏళ్ళుగా ఆగిన ఈ ఉత్సవాన్ని టిటిడి 2010వ సంవత్సరంలో పునరుద్ధరించింది. అయితే 2020 నుండి కార్తీక మాసంలో వర్షాల కారణంగా పార్వేట మండపంలో కార్తీక వన భోజనాలు జరుగలేదు. ఐదేళ్ల తర్వాత పార్వేట మండపంలో వన భోజన మహోత్సవం నిర్వహించడంతో వేలాదిగా భక్తులు ఉత్సాహంగా పాల్గొని భగవంతుని సమక్షంలో సహపంక్తి భోజనం చేశారు. 

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టుల తరపున వివిధ భక్తి సంగీత కార్యక్రమాలు, హరికథలు ఏర్పాటు చేశారు.
       
తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments