తిరుమలలోని
శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు.
అనంతరం లడ్డూ కౌంటర్ లోని కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడంలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా లడ్డూల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
లడ్డూల నాణ్యత, రుచి, క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గించడం వంటి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో లడ్డూల ఉత్పత్తిని పెంచి కౌంటర్ల వద్ద త్వరితగతిన భక్తులు లడ్డూలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు.
ఈ తనిఖీల్లో చైర్మన్ వెంట శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పోటు పేష్కార్ శ్రీ ముని రత్నం, ఇతర అధికారులు ఉన్నారు.
No comments :
Write comments