డిసెంబర్
30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల భద్రత ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీ&ఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి టీటీడీ, పోలీసు ఉన్నతాధికారులతో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనాల భద్రతా ఏర్పాట్లపై మూడు గంటల పాటు క్షేత్రస్థాయిలో చర్చించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుందని, టోకెన్ లేని భక్తులకు జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా నేరుగా సర్వ దర్శనాలకు రావచ్చని భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు.
తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రాంతాల్లో భక్తులకు తెలిసే విధంగా రేడియో&బ్రాడ్ కాస్టింగ్, సోషియల్ మీడియా, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా భక్తులకు అవగాహన కల్పించేందుకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని విభాగాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని భక్తులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠ ఏకాదశి ముందురోజు సాయంత్రం నుండి భక్తులకు అన్న పానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్న ప్రసాద విభాగం అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సేవలు అందించేందుకు అవసరమైన సంఖ్యలో శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో ఎలాంటి అయోమయం తలెత్తకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ, పోలీసు అధికారులతో వాట్సాప్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమస్యలపై తక్షణం స్పందించేలా సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ ఫణి కుమార్, సీఈ శ్రీ సత్య నారాయణ, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ, ఇతర టీటీడీ, పోలీసు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments