తిరుమల
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16వ తేదీ శుక్రవారం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. అదేరోజున గోదాపరిణయోత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. ఈ మాలలను శ్రీవారి మూల మూర్తికి అందంగా అలంకరించారు.
శుక్రవారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంటనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యాహము జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదనము జరిగి హారతులు జరిగాయి.
శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత యాదవ భక్తుడు సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి అయి గొల్లకు బహుమానము జరిగింది.
తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు ఈటె వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి విశేషంగా భక్తులు విచ్చేసారు. శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హతీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది.
ఈ ఉత్సవంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments