పులిచర్ల మండలం మంగళంపేటలో ప్రసిద్ధిచెందిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 08.00 నుండి 09.00 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కాగా, రాత్రి పెద్ద శేష వాహనంపై స్వామివారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.
ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 08.00 గం.ల నుండి 09.00 గం.లకు, సాయంత్రం 06.00 గం.ల నుండి 08.00 గం.ల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
శనివారం సాయంత్రం 06.00 గం.లకు స్వామి వారు పెద్ద శేష వాహనంపై విహరించనున్నారు.
వాహన సేవల వివరాలు
ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం చిన్న శేష వాహనం, సాయంత్రం హంస వాహనం, 23వ తేదీ ఉదయం ముత్యపు పందిరి వాహనం, సాయంత్రం సింహ వాహనం, 24వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం హనుమంత వాహనం, 25వ తేదీ ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం 06.00 గం.లకు కల్యాణోత్సవం, రాత్రి 08.00 గం.లకు గరుడ సేవ, 26వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్ర ప్రభ వాహనం, 27వ తేదీ ఉదయం మోహినీ ఉత్సవం, సాయంత్రం గజ వాహనం, 28వ తేదీ ఉదయం 08.00 గం.లకు రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం, మార్చి 01వ తేదీన ఉదయం 11.00 గం.లకు చక్ర స్నానం, రాత్రి 07.00 గం.లకు ధ్వజావరోహణం, మార్చి 02వ తేదీ ఉదయం 09.00 గం.లకు పుష్పయాగ మహోత్సవం చేపడుతారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సూపరింటెండెంట్ శ్రీ వై. నాగేంద్ర ప్రసాద్, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ రాహుల్ యాదవ్, జూనియర్ అసిస్టెంట్ శ్రీ శ్రీ హర్ష, భానుప్రకాశ్, సిబ్బంది, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments