తిరుపతి
శ్రీకపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 6.05 గంటలకు మకర లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.
ఏడాదికోసారి ధ్వజస్తంభానికి విశేష అభిషేకం…
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణభట్టర్ శ్రీ ఉదయ్ స్వామి గురుకుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అనంతరం శ్రీ సోమస్కందమూర్తి (శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి), శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్రీ ఎం.రవిచంద్ర, జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఆలయ ప్రత్యేక అధికారి శ్రీ డి. ఫణికుమార్ నాయుడు, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ కె.పి.చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments