శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన బుధవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసురవధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సర్వభూపాల వాహనం - యశోప్రాప్తి :
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు.
వాహనసేవలో టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళికృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు ఆలయ ప్రత్యేకాధికారి డా.టి.రవి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, కంకణభట్టర్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మునికుమార్, శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





No comments :
Write comments