శ్రీ
కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన అదనపు ఈవో కు శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో శ్రీ టి. బాపిరెడ్డి ఆలయ సంప్రదాయాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వస్త్రాల సమర్పణల అనంతరం ఆయన వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ దక్షిణాది మూర్తి దర్శనం అనంతరం ఆలయ ఈవో వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందించారు.
పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా – శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి
దక్షిణ భారతదేశంలో గొప్ప శైవక్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతోందని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విశేషంగా పెరగుతోందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు పరిసర ప్రాంత ఆలయాల సందర్శనలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు.
దేశ విదేశాల నుండి భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చి రాహుకేతు పూజలను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి ప్రసిద్ధి చెందిందన్నారు. శ్రీవారి చెల్లెలు భ్రమరాంబ, చెల్లెలు సౌభాగ్యం కోసం శ్రీవేంకటేశ్వరుడు పట్టువస్త్రాలు పంపుతున్నారని మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి, అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ కాళహస్తీశ్వరుడికి గత 26 సంవత్సరాలుగా టిటిడి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఇలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments