టిటిడి
ఈవో శ్రీ ఎం. రవిచంద్ర, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ తో కలిసి శనివారం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన ఈవో, అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిమాణం, వడ్డన విధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈవో వద్ద భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.
తదుపరి అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతో, ప్రత్యేకంగా శ్రీవారి సేవకులతో ఈవో మాట్లాడి వారి సేవలను అభినందించారు.
అనంతరం తాగునీరు, ఆహార పరీక్షా ప్రయోగశాలను సందర్శించిన ఈవో, వివిధ ప్రమాణాలపై ఆహార పదార్థాల పరీక్షా ప్రక్రియను ఏవిధంగా నిర్వహిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఆక్టోపస్ భవనం నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు ఉన్న బయటి క్యూ లైన్లను పరిశీలించిన అనంతరం ఈవో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, హెడ్ కౌంట్ తదితర విశ్లేషణ వ్యవస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న దాత శ్రీ వి. జయప్రకాశ్ తో వర్చువల్‌గా మాట్లాడారు.
అనంతరం పీఏసీ-5ను సందర్శించిన ఈవో, లాకర్లు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, స్మార్ట్ షూ కీపింగ్ సెంటర్ వంటి సౌకర్యాలను పరిశీలించి, భక్తుల సౌకర్యార్థం మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments