తిరుపతిలోని
ఎస్వీ గోసంరక్షణశాలలో ఏర్పాటు చేసిన టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని టీటీడీ జేఈవో (విద్యా, ఆరోగ్యం) డాక్టర్ ఎ. శరత్ శనివారం సాయంత్రం పరిశీలించారు.
ఈ సందర్భంగా తయారీ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, ముడిసరుకు వినియోగం, ప్యాకేజింగ్ విధానం తదితర అంశాలను పరిశీలించారు. కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ కేంద్రంలో ఆరు రకాల అగరబత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో చామంతి, గులాబీ, తామర పూల సుగంధాలతో అగరబత్తులు తయారు చేస్తున్నారని వివరించారు.
అదనంగా సంపంగి, వెయ్యి వరహాలు, తులసి సుగంధాలతో మరో మూడు కొత్త రకాల అగరబత్తులను త్వరలో తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించే ఉత్పత్తులను అందించడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అగరబత్తుల తయారీ కార్యక్రమం ద్వారా గోసంరక్షణశాలలో లభించే వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భక్తులకు శ్రేష్ఠమైన ధూప ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఎస్వీ గోశాలను పరిశీలించారు. గోవులు, పేరు దూడలు, ఏనుగులు ఇతర పశువులు ఉన్న షెడ్లలో సమయానికి దానా, తాగునీరు, వైద్య సదుపాయం, పరిశుభ్రత, ఎస్వీ గోశాల నుండి పాలను తరలించే సమయాన్ని తెలియజేసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, అగరబత్తి ఉత్పత్తి కేంద్రం అధికారులు, గోశాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments