టిటిడి
ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలను దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దాలని టిటిడి జేఈవో (వైద్య, విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. మంగళవారం ఆయన ఎస్వీ ఆయుర్వేద కళాశాల మరియు అనుబంధ వైద్యశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, కళాశాల మరియు వైద్యశాలలో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రాచీన ఆయుర్వేదంలోని విశిష్టతను నేటి తరానికి చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయుర్వేద వైద్యులు ప్రణాళికాబద్ధంగా పరిశోధనలు చేపట్టి మార్గదర్శకులుగా నిలవాలని కోరారు.
ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కళాశాలలోని సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల సమస్యలు, కళాశాల మౌలిక సదుపాయాలు, సిబ్బంది, భద్రత వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులు ఆయుర్వేదంలో నూతన పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు.
అంతకుముందు ఆయన విద్యార్థులతో ముచ్చటించి, వారి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బోధనా సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అవసరమైన భవనాల నిర్మాణానికి సంబంధించి ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. రేణు దీక్షిత్ కళాశాల పురోగతి, వైద్యశాలలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలను జేఈవోకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, ఈఈ శ్రీమతి సుమతి, కళాశాల బోధనా సిబ్బంది మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments