శ్రీవైష్ణవ
భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వార్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని టీటీడీ జేఈవో డాక్టర్ ఏ.శరత్ తెలియజేశారు. తిరుమలలోని అనంతాళ్వార్ తోట (పురశైవారితోట) లో శ్రీ అనంతాళ్వార్ 972వ అవతార మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అనంతాళ్వార్ అవతార మహోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. భక్తి అంటే ప్రార్థన మాత్రమే కాదని, భక్తి అంటే సేవ అని నిరూపించిన మహానుభావుడు అనంతాళ్వార్ అని కీర్తించారు. 972 సంవత్సరాలుగా అనంతాళ్వార్ వంశీకులు శ్రీవారికి పుష్ప కైంకర్యం చేస్తున్నారని, వారి పరంపర ఎల్లప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అనంతాళ్వార్ వంశీకులు ''నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠిగానం'' నిర్వహించారు.
అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
ఈ సందర్భంగా వేంకటాచల ఇతిహాసమాల, రామానుజులవారి తిరుమల యాత్ర, స్వామి పుష్కరిణి వైభవం, శ్రీ రామాయణ కాలక్షేపం, తిరుమలనంబి – తన్నీరముదు ఉత్సవం, మూలవర్ల తిరుమంజనం – తిరునామం, తిరుమలలో రామానుజ సన్నిధి ప్రతిష్ట, సహస్రనామార్చన వైభవం, తిరుమలలో జీయర్ మఠం స్థాపన, శ్రీవారి సుప్రభాతం-ఏకాంత సేవ, తిరుమలలో దివ్యప్రబంధ క్రమం, తిరుమలలో పుణ్య తీర్థాలు తదితర అంశాలపై వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పండితులు ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో అనంతాళ్వార్ వంశస్తులు శ్రీ వేంకట కృష్ణ స్వామి, శ్రీ భరద్వాజస్వామి, తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments