టిటిడి
ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని ఉత్తమమైన ప్రయోగశాలగా అభివృద్ధి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ అధికారులకు సూచించారు. సోమవారం శ్రీనివాస మంగాపురం సమీపంలోని నరసింగాపురంలో ఉన్న ఫార్మసీని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫార్మసీ 19 ఎకరాల విస్తీర్ణంలో ఉందని తెలిపారు. ఇందులో సమగ్రంగా హెర్బల్ మెడిసిన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. రోగాలకు అవసరమైన మందులు, వాటికి అవసరమైన మొక్కలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులు, అలాగే బయట నుంచి తీసుకొస్తున్న ఔషధ మొక్కల వివరాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.
బయట నుంచి ఔషధ మొక్కలపై ఆధాపడే విధానాన్ని తగ్గించి, ఫార్మసీ భూమిలోనే ప్రణాళికాబద్ధంగా మొక్కలను పెంచి, అవసరమైన ముడి పదార్థాలను ఇక్కడే మరింత నాణ్యంగా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫార్మసీ భూమిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి, హెర్బల్ మెడిసిన్ ప్లాంట్‌గా అభివృద్ధి చేయాలని తెలిపారు.
ప్రస్తుతం పెంచుతున్న మొక్కలు, బయట నుంచి తెచ్చే మొక్కల వివరాలు సేకరించి, వాటిని ఎంతవరకు తగ్గించవచ్చో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ భూమిని ప్రయోగశాలలా అభివృద్ధి చేసి, ఆకులు, వేర్లు, చెక్కలు వంటి ఔషధ భాగాలకు అవసరమైన మొక్కలను ఇక్కడే పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమీక్ష అనంతరం ఫార్మసీలో తయారు చేస్తున్న ఉత్పత్తులను, యంత్రాల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఔషధ, సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈవో శ్రీ ఎ. చంద్రశేఖర్, ఫార్మసీ ఇన్‌చార్జ్ డా. రేణు దీక్షిత్, ఎస్.ఈ శ్రీ నరసింహ మూర్తి, డీఈ శ్రీ దామోదర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments