ఒంటిమిట్ట
శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న శ్రీరామనవమి పర్వదిన ధ్వజారోహణముతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం, కళ్యాణ వేదికల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈవో అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కల్యాణం రోజున వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైన అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించేందుకు చక్కటి ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని విభాగాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని కల్యాణం రోజున భక్తులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు భక్తులు నడిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాలని, అవసరమైన చోట్ల చలువపందిళ్లు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఊరేగింపు నిర్వహించే వాహనాలు, రథానికి సంబంధించిన పటిష్టతను పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నారు. .
అత్యవసర వైద్య పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. కల్యాణం రోజున భక్తుల రవాణా, వసతి, పార్కింగ్ కల్పించేందుకు ఆర్‌టిసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండి కడప జిల్లాలోని ఆయా విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ఎస్ఇ శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవో శ్రీ శివ ప్రసాద్, విజిఓ శ్రీ గిరిధర్, డిఈ (ఎలక్ట్రికల్) శ్రీ రవి శంకర్ రెడ్డి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments