ఒంటిమిట్టలో
జరుగుతున్న శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాల సమగ్ర సమాచారాన్ని భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచింది. ఒంటిమిట్టలోని పీఏసీకి ఎదురుగా టీటీడీ సమాచార విభాగం ఆధ్వర్యంలో ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ఈ ప్రదర్శనలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ చరిత్ర, ఆలయంలోని అద్భుత శిల్పకళా వైభవం, శిల్ప సంపదకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. అలాగే జాంబవంతుడు, తాళ్లపాక అన్నమాచార్య విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు.
అదేవిధంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, నందలూరు సౌమ్యనాథస్వామి దేవాలయం, జమ్మలమడుగు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వంటి ఆలయాలతో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల వివరాలను కూడా ప్రదర్శనలో పొందుపరిచారు.
ప్రతి ఆలయానికి సంబంధించిన చరిత్ర, స్థాపన నేపథ్యం, ప్రత్యేకతలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆయా ఆలయాలకు చేరుకునే మార్గాల వివరాలను సవివరంగా తెలియజేశారు. ఈ సమాచారం భక్తులకు భవిష్యత్తులో ఆలయ దర్శనాలకు ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ఈ ప్రదర్శనను తిలకించి టీటీడీ ఆలయాల చరిత్ర, వైభవం, విశిష్టతలను తెలుసుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.
No comments :
Write comments