తెలుగు
ప్రజల ఆత్మగౌరవం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని ద్రావిడియన్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ఆచార్యులు డా. అరవింద్ కుమార్ కొనియాడారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపన్యాసకులుగా విచ్చేసిన డా. అరవింద్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. ఇతరుల కోసం తమ జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడేవారే నిజమైన నాయకులుగా నిలుస్తారని, ఇందుకు శ్రీ పొట్టి శ్రీరాములు గొప్ప ఉదాహరణగా నిలిచారని చెప్పారు.
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్లాలన్న ఆయన దృఢ సంకల్పం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. తెలుగు భాష ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అహింసా మార్గంలో ఆయన పోరాటాన్ని కొనసాగించారని వివరించారు. చెన్నైలోని రాయపేట రోడ్డులో గల శ్రీ బులుసు సాంబమూర్తి నివాసంలో నిరాహార దీక్ష ప్రారంభించి, పట్టుదలతో దీక్షను కొనసాగించి చివరకు ప్రాణత్యాగం చేశారని తెలిపారు.
అనంతరం పలువురు టీటీడీ ఉద్యోగులు ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు అతిథులు శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
No comments :
Write comments