ఉరుకులు
పరుగులుగా సాగుతున్న నేటి ఆధునిక జీవన విధానంలో శారీరక, మానసిక అభివృద్ధికి అలాగే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి క్రీడలు ఎంతో అవసరమని టిటిడి సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు తెలిపారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిటిడి ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారని, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడల ద్వారా మనలోని కొత్త ప్రతిభా కోణాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రతి రోజూ క్రీడలు, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని, ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తి పెరిగితే వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు విధులను మరింత సమర్థంగా నిర్వర్తించగలరని సూచించారు.
టీటీడీ సిపిఆర్ఓ డాక్టర్ టి. రవి మాట్లాడుతూ, క్రీడల్లో పాల్గొనడం ద్వారా పోటీతత్వం పెరిగి మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. క్రీడల వల్ల మానసిక ఉత్తేజం పెరిగి సంస్థలో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రేరణ లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు, సంగీతం ఎంతో అవసరమని తెలిపారు.
ప్రతి ఏడాది నిర్వహించే టిటిడి వార్షిక క్రీడల్లో 80 సంవత్సరాల పైబడిన విశ్రాంత ఉద్యోగులు సైతం ఉత్సాహంగా పాల్గొని ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లల కోసం సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సంక్షేమాధికారి శ్రీ ఆనందరాజు, డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ పోటీల్లో ఉద్యోగుల్లో మొత్తం 616 మంది ప్రథమ, 533 మంది ద్వితీయ, 106 మంది తృతీయ బహుమతులు అందుకున్నారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 2,400 మంది ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు క్రీడాపోటీలలో పాల్గొన్నారు. వీరిలో 1,600 మంది పురుషులు, 800 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సిఏఓ శ్రీ వెంకటరమణ, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వరరావు, డిఈ శ్రీ చంద్రశేఖర్, ఐటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
No comments :
Write comments