ఒంటిమి
ట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా టీటీడీ మరియు జిల్లా అధికారులు బుధవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, కళ్యాణ వేదిక వద్ద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్, సిఎం విడిది చేయనున్న టీటీడీ అతిథి గృహం, ఆలయ దర్శనం, వేద ఆశీర్వచనం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, గ్యాలరీలు, భక్తులకు అందించనున్న అన్నప్రసాదం కౌంటర్లను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేఈవో మాట్లాడుతూ, శ్రీరామనవమి సందర్భంగా 50 నుండి 60 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులందరికీ రుచికరమైన అన్నప్రసాదం అందించాలని, పానకం, వడపప్పు తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. ఆలయంలో ఎండ వేడిమి నుండి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు నిరంతరం నీటిని పిచికారి చేయాలని సూచించారు. అలాగే కళ్యాణ వేదికకు విచ్చేసే ప్రతి భక్తునికి వాటర్ బాటిళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ, సుమారు 3000 మంది పోలీసులతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు పార్కింగ్ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎస్ఈ శ్రీ మనోహరం, ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు శ్రీమతి ఎ. ప్రశాంతి, శ్రీ ఎ. శివప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments