తిరు
మల శ్రీవారు, శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం దర్శనార్థం విచ్చేసే భక్తులు అనుకోకుండా అనారోగ్యానికి గురైన సందర్భాల్లో వారికి మరింత విశ్వాసాన్ని కల్పించే విధంగా సమగ్ర వైద్య సేవలు అందించాలని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ సూచించారు.
తిరుచానూరులోని టిటిడి ఉచిత వైద్యశాలను, అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టిటిడి ఆధ్వర్యంలో 7 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు,5 డిస్పెన్సరీల ద్వారా భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్లోని టిటిడి ఉచిత వైద్యశాలలో ఆలయ సమయాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం 5 నుండి 10 పడకలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
తిరుచానూరులో రోజుకు సుమారు 100 నుండి 150 మంది ఔట్పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని, మరింత మందికి నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. అత్యవసర సమయాల్లో చిన్నపాటి వైద్య సహాయం కూడా రోగులకు అపారమైన ధైర్యాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన మందులతో పాటు, మరింత మనోధైర్యాన్ని కలిగించే సేవలను అందించాలని కోరారు.
అనంతరం అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అలిపిరి కేంద్రంలో గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్, చెన్నై వారు మానవ వనరులను అందిస్తుండగా, అవసరమైన ఔషధాలను టిటిడి సరఫరా చేస్తోందని తెలిపారు. తిరుమలకు చేరే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన మందులను సమృద్ధిగా నిల్వ ఉంచాలని ఆదేశించారు. భక్తులు అనుకోకుండా అనారోగ్యానికి గురైనపుడు వారికి తక్షణం వైద్య సేవలు అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వెంట సిఎంవో డా. కుసుమ కుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సుహర్లత, వైద్యుడు డా. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments