తిరు
అంటే ‘శ్రీ’, నామం అంటే ‘తిలకం’. తిరునామాన్ని శ్రీనామం అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిరునామాన్ని శుభసూచికంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రతీక.
తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు మనకు తోడుగా, అండగా ఉన్నాడన్న భావన కలుగుతుంది. సత్ప్రవర్తనతో, భక్తిభావంతో మెలగుతారు.
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి భక్తిసంప్రదాయాన్ని పెంచేందుకు టిటిడి భక్తులకు తిరునామధారణ చేయిస్తోంది.
తిరునామంలో ఎర్రటికాంతిలా కనిపించే ఆకారం ఆత్మను సూచిస్తుంది. కొంత మంది భక్తులు భుజాలు, ఛాతిపైన, వీపుపై కింది భాగాన తిరునామం ధరిస్తారు. భక్తులు కనుబొమల మధ్య నుంచి నుదుటిపై వరకు ధరిస్తారు. తిరునామం ధరించినవారు శ్రీవేంకటేశ్వరుని సేవకులని సులువుగా గుర్తించవచ్చు. నుదుటన గల ఆగ్నేయచక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడుదృష్టి పడకుండా ఉంటుందని భక్తుల నమ్మకం.
తిరునామం కోసం నామకోపు, ఎర్రసింధూరం వినియోగిస్తున్నారు. తిరునామం పెట్టుకుంటే చలువ చేస్తుందని కూడా కొందరు భక్తుల అభిప్రాయం. తిరునామధారణ కోసం ప్రత్యేకంగా రాగితో తయారుచేసిన కప్పు, మూడు నామాల ముద్రను ఉపయోగిస్తారు.
శ్రీవారి ''తిరుమణికాప్పు''
శ్రీవారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. గురువారం సడలింపు(ఆభరణాలు తొలగించే) సమయంలో నేత్రాలు భక్తులకు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూంటుంది. ఈ నామాన్ని ‘తిరుమణికాప్పు’ అని అంటారు. ఇందుకుగాను 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు.
తిరునామ సేవ :
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన ప్రవేశ మార్గం, శ్రీవాణి దర్శన ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో సర్వ దర్శనం భక్తులకు, అదేవిధంగా గొల్ల మండపం, రామ్ భగీచా- 3, బేడి ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణకట్ట, సుపథం, వరాహస్వామివారి ఆలయం, నాలుగు మాడ వీధులు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంతి గృహం, జీఎన్సీ, నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం పరిసర ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు రెండు షిప్టుల్లో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు.
తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా, కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
No comments :
Write comments