భగవంతుడు
అందరివాడని, సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వ భావనతో జీవించాలనే సందేశాన్ని శ్రీ రామానుజాచార్యులు ఇచ్చారని తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తెలిపారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 22 వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ, ఆదిశేషుని అవతారమైన రామానుజాచార్యులు శరణాగతి భక్తిని విస్తృతంగా ప్రచారం చేశారని చెప్పారు. శరణాగతి భావంతో భగవంతుని సేవించడం ద్వారా జీవితం సార్థకమవుతుందని వివరించారు.
అలాగే, ఆయన ప్రచారం చేసిన విశిష్టాద్వైత తత్వం భక్తి, జ్ఞానం, సేవ మార్గాలను కలిపి సమాజానికి దిశానిర్దేశం చేసిందన్నారు. రామానుజాచార్యుల బోధనలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.
అనంతరం హైదరాబాద్‌కు చెందిన శ్రీ పరకాలన్ “శ్రీ రామానుజాచార్యులు - వైభవం” అంశంపై ప్రసంగించారు. భక్తి ఉద్యమం ద్వారా సమాజ సంస్కరణకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు రామానుజాచార్యులని చెప్పారు. కులమత భేదాలకు అతీతంగా సమానత్వాన్ని ప్రోత్సహించిన ఆచార్యుడిగా ఆయన నిలిచారని వివరించారు.
తదుపరి తిరుపతికి చెందిన శ్రీ సరస్వతి ప్రసాద్ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం మరియు భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments