ఒంటిమిట్ట
శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు.
రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.
రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేపట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్తయింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
భక్తులందరికి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన తలంబ్రాల పంపిణీ :
కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తులందరికి శ్రీవారి సేవకులు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన తలంబ్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేఈవో శ్రీ శరత్ తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments