30.5.26

సూర్యకిరణాల తేజస్సులో భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై దివ్య మంగళ విహారం surya prabha vahanam












తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. సూర్యభగవానుని తేజస్సును ప్రతిబింబించే వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది.


ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ గోవిందనామస్మరణతో వీధులను మార్మోగించారు.


సూర్యుడు తేజోమయుడు, సకలరోగ నివారకుడు, జగత్తుకు చైతన్యప్రదాతగా పురాణాలు వర్ణిస్తున్నాయి. వర్షాలు, పంటలు, ఓషధులు, జీవజాలం అన్నీ సూర్యుని కరుణాకటాక్షంతోనే అభివృద్ధి చెందుతాయని వేదాలు తెలియజేస్తున్నాయి.


 అటువంటి సూర్యతేజస్సు స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వడం విశేష ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది.


అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం చేశారు.


సాయంత్రం 5.30 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. అనంతరం స్వామివారు కల్యాణకట్ట మండపానికి వేంచేసి, అక్కడ తేరుచూపు అనంతరం తిరిగి వాహనమండపానికి చేరుకుంటారు.


రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


మే 30 రథోత్సవం


శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవోపేతమైన రథోత్సవం మే 30వ తేదీ శనివారం ఉదయం 5.40 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు.


ఈ వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో శ్రీ శ్రీనివాస రావు, సూపరింటెండెంట్లు శ్రీ చిరంజీవి, శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, శ్రీ రంజిత్, తదితర అధికారులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments